విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నుల పంపిణీ
నారాయణపేట: గ్రేట్ తెలంగాణ న్యూస్
పేద విద్యార్థులను ఆదుకునేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ కృషి చేస్తుందని భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులు తిప్పన్న, సుదర్శన్ రెడ్డి అన్నారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేటలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్ వాడి పాఠశాల, తదితర పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను అందజేయడం జరిగిందని తెలిపారు. భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించి వారికి విద్యాబుద్ధులను నేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పేదలకు చేయూతనిచ్చేందుకు తమ సంస్థ ఎనలేని కృషి చేస్తుందని వారు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బాలాజీ, నరసింహ, శివరాజ్, శ్రీనివాస్, హనుమంతు, సంతోష్, గోపాల్, అధిక సంఖ్యలో సభ్యులు, స్థానికులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.