Sunday, December 22, 2024

తెలంగాణ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

తెలంగాణ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

గ్రేట్ తెలంగాణ ప్రతినిధి ఇంటర్నెట్ డెస్క్:

తెలంగాణను భారీ వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించట్లేదు.! కొన్ని జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడిందా.. అనేంతలా గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.! ఇక హైదరాబాద్‌లో అయితే ఎప్పుడు వర్షం పడుతుందో.. ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి. దీంతో నగర ప్రజలు ఇళ్లలో నుంచి బయటికెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. బయటికెళ్తే ఎన్నింటికి ఇంటికి తిరిగొస్తారో కూడా తెలియట్లేదు. ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాన తగ్గినా, వరద కొనసాగుతోంది!.

వదలనంటున్న వాన!

ఆదివారం రోజు రాష్ట్రంలో వానలు కాస్త గ్యాప్ ఇచ్చాయని అనుకునే లోపే వాతావరణ శాఖ మరో బాంబ్ లాంటి వార్త పేల్చింది!. 24న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిసా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ దగ్గరలోని వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావం వలన తెలంగాణలో 24నుంచి మూడు నుంచి నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే.. రాగల మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 25, 26 వ తేదీల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు..

కాగా.. ఆదివారం నాడు ఉదయం నుంచి ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌, జనగాం, సిరిసిల్ల, ములుగు, ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, నిజామాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో వర్షాలు భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నాడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని.. మిగిలిన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ నాలుగైదు రోజులు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీ లో ఇదీ పరిస్థితి .

తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మరో రెండ్రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొత్తానికి చూస్తే.. మరో ఐదురోజులు తెలంగాణను, మూడ్రోజులు ఏపీలో భారీగానే వర్షాలు కురువనున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular