ఏసీబీ వలలో అనంతపురం సబ్ రిజిస్ట్రార్
గ్రేట్ తెలంగాణ ప్రతినిధి అనంతపురం.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి, అనంతపురంలో గిఫ్ట్ డీడ్ కింద లాడ్జ్ రిజిస్ట్రేషన్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన అనంతపురం సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణ ముర్తి ఏసీబీకి దొరికిపోయాడు. డాక్యుమెంట్ రైటర్ చంద్రశేఖరరావుతోపాటు అతని అసిస్టెంట్ కృష్ణ మురళీ ద్వారా రూ.1.30 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
*రూ.1.30 లక్షలకు బేరం..*
వివరాలను ఒంగోలు ఏసీబీ డీఎస్పీ, అనంతపురం ఇన్‌చార్జ్ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. అనంతపురానికి చెందిన అన్నదమ్ములు ముత్తుకూరు రామ్మోహన్‌రావు, రవీంద్ర నాథ్ 1996లో ఆర్టీసీ బస్టాండు సమీపంలోని స్థలం కొనుగోలు చేశారు.
కొమలపేరుతో లాడ్జ్
ప్రస్తుతం ‘కోమల’ పేరుతో లాడ్జ్ నడుపుతున్నారు. గత నెల రామ్మోహన్‌రావు అన్న మరణించారు. దీంతో అన్న వాటాను గిఫ్ట్ డీడ్ కింద తనపేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రామ్మోహన్‌రావు భావించారు.అన్ని పత్రాలతో అనంతపురం సబ్‌రిజిస్ట్రార్‌ను కలవగా.. స్థలాన్ని పరిశీలించి అనంతరం రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. స్థలాన్ని పరిశీలించి.. ఇది కమర్షియల్ లాడ్జ్ భవనం అయినందున రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదని తెలిపారు. అయితె ఇదంతా అక్కడే ఉన్న డాక్యుమెంట్ రైటర్ చంద్రశేఖర్‌రావు కలుగజేసుకుని డబ్బిస్తే రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు. రూ. లక్ష ఇచ్చేందుకు రామ్మోహన్ సిద్ధపడినా సబ్ రిజిస్ట్రార్ ఒప్పుకోలేదు. రూ. 2 లక్షలిస్తే పని చేస్తామని చెప్పారు. డాక్యుమెంట్ రైటర్ చంద్రశేఖరరావు వద్ద బేరమాడితే రూ.1.30 లక్షలకు ఒప్పుకున్నాడు.లంచం ఇవ్వడం ఇష్టం లేని రామ్మోహన్.. ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు గురువారం రూ.1.30 లక్షలు తీసుకుని సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణను కార్యాలయంలో కలిశారు. అతని సూచన మేరకు డబ్బును డాక్యుమెంట్ రైటర్ చంద్రశేఖరరావు ఇవ్వగా,అతను అసిస్టెంట్ కృష్ణమురళీకి ఇచ్చాడు.సాయంత్రం 4 గంటల సమయంలో కృష్ణమురళీ నుంచి సబ్‌రిజిస్ట్రార్ తీసుకుంటుండగా, అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కృష్ణమురళీ ఏసీబీ అధికారులను చూసి ఉడాయించే ప్రయత్నం చేయగా, అతనికి అక్కడే కౌన్సెలింగ్ ఇచ్చారు.
సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణ సెల్‌ఫోన్‌లో జరిపిన సంభాషణలు రికార్డు కావడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణతో పాటు డాక్యుమెంట్ రైటర్ చంద్రశేఖరరావు, అసిస్టెంట్ కృష్ణమురళీలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరుస్తామన్నారు.
అధికారుల నిర్బంధం..
గురువారం సాయంత్రం అనంతపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు వెంటనే తలుపులు మూసివేశారు. ఉద్యోగులు, సిబ్బంది నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.బయటకు పంపకుండా నిర్బంధించారు. లంచం తీసుకున్న కృష్ణ మురళీని ప్రశ్నించారు. సహకరించకపోవడంతో అక్కడే కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా, రాత్రి 12 వరకూ సత్యనారాయణ మూర్తి గతంలో రిజిస్ట్రేషన్ చేసిన రికార్డులు పరిశీలించిన అధికారులు, అతని ఇంట్లోనూ సోదాలు చేసినట్లు తెలిసింది.