ప్రపంచ జల దినోత్సవం: తాడిబోయిన రామస్వామి యాదవ్
శేర్లింగంపల్లి మార్చి 23 ( గ్రేట్ తెలంగాణ రిపోర్టర్).
ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ చే ముద్రింపబడిన ప్రపంచ జల దినోత్సవ అవగాహన పత్రాన్ని హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి. 15వ డివిజన్ జనరల్ మేనేజర్ రాజశేఖర్ హఫీజ్ పేటలోని వారి కార్యాలయములో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “ఈ విశ్వంలో సమస్త జీవకోటికి గాలి తరువాత నీరే ప్రాణాధారమని, నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదము వెల్లి విరుస్తుందని అలాగే అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధాన ఆధారమని అన్నారు. శరవేగంగా పెరుగుతున్న జనాభాకు అంతే వేగంగా నీటి అవసరం కూడా పెరుగుతుంది. మరోవైపు భూమిపై ఉన్న నీటి వనరులలో 97 శాతం సముద్ర జలాలే . మిగిలిన 3 శాతం నీటిలో కేవలం ఒక్క శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరుగా త్రాగునీటి అవసరాలు తీరుతున్నాయని, పరిశుభ్రమైన త్రాగునీరు అందక ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అనేక రోగాల బారినపడి వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. అలాగే అనేక దేశాలలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్యసమితి వారు ప్రపంచ జల దినోత్సవాన్ని 22మార్చి 1993నుండి నిర్వహిస్తున్నారని, నీటి యొక్క ప్రాముఖ్యతని తెలియజేసి, ప్రజలలో అవగాహన పెంచే విధంగా ఒక ప్రత్యేకమైన నినాదంతో దీనిని నిర్వహిస్తున్నారని, ఈ సంవత్సరపు నినాదం “మార్పును వేగవంతం చేస్తుంది”. ప్రతి ఒక్కరూ ప్రకృతి ప్రసాదించిన నీటి వనరులను కలుషితం చేయకుండా సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రభుత్వము , పౌర సమాజం మీదే ఉందని అన్నారు. మనకు లభ్యమయ్యే నీరు వర్షం ద్వారా నదులు, చెరువుల మరియు భూగర్భము నుండి లభ్యమవుతుంది. నీటి సంరక్షణ చర్యలలోని భాగంగా ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడం, వృధాని అరికట్టడం, వర్షపు నీటిని సముద్రము పాలు కానీయకుండా చెక్కు డాములు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని భూగర్భ జలాల నీటి మట్టం పెంచే విధంగా కృషి చేయాలన్నారు. మనం వాడిన మురుగు నీటిని శుద్ధి చేసి మొక్కల పెంపకానికి పునర్వినియోగం చేయాలని తెలియజేశారు. ప్రతి మానవునికి రోజుకు కనీసం 135 లీటర్ల నీరు త్రాగడానికి , ఇతర అవసరాలకు అవసరమవుతుందని , తగిన జాగ్రత్తలు తీసుకోని యెడల భవిష్యత్తులో గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రల మధ్యే కాకుండా దేశాల మధ్య కూడా వివాదాలు తలయెత్తే ప్రమాదముందని అన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తు తరాలకు అవసరమైన నీటిని అందించడానికై అందరిచేత నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమములో జల మండలి అధికారులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జి.వి.రావు, పాలం శ్రీను, జనార్ధన్, మల్లారెడ్డి, అమ్మయ్య చౌదరి, కొవ్వూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.