డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తాం: దర్పల్లి రాజశేఖరరెడ్డి
ఎల్బీనగర్: స్వచ్ఛ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని స్వచ్ఛ ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకుడు కేతావత్ గోపాల్ నాయక్ అన్నారు. జిహెచ్ఎంసిలో చెత్తను తరలించే కాంట్రాక్టును రాంకీ సంస్థకు అప్పగించడంతో స్వచ్ఛ ఆటోలు నడుపుతున్న కార్మికులను దశలవారీగా తొలగించడానికి నిరసిస్తూ స్వచ్ఛ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో సరూర్ నగర్ లోని ఎల్బీనగర్ జిహెచ్ఎంసి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా గోపాల్ నాయక్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిధిలో చెత్తను తరలించే బాధ్యతను రాంకీ సంస్థకు అప్పగించడంతో సదరు సంస్థ ప్రస్తుతం చెత్తను తరలిస్తున్న స్వచ్ఛ ఆటో డ్రైవర్లను తొలగిస్తుందని ఆరోపించారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కరోనాను సైతం లెక్కచేయకుండా కార్మికులు తమ ప్రాణాలకు తెగించి వీధులను శుభ్రం చేస్తూ చెత్తని తరలించారని ఆయన గుర్తు చేశారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజులేని పోరాటం చేస్తామని ఆయన హామీనిచ్చారు. స్వచ్ఛ డ్రైవర్ల నిరసన విషయాన్ని తెలుసుకున్న సరూర్‌నగర్ ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్ల నిరసన విషయాన్ని తెలుసుకున్న జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి, కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. అధికారులు, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి హామీతో స్వచ్ఛ ఆటో డ్రైవర్లు నిరసనను విరమించారు. కార్యక్రమంలో కార్మికులు జగపతిరాజు, యాదయ్య, మౌలాలి, ప్రభాకర్, గణపతి, సోమయ్య, చంద్రనాయక్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.