* ట్యాంకు ఓవర్ ఫుల్ తో రైతు కంట కన్నీరు మిగిల్చింది
గార్ల: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం అధికారుల అలసత్వం కారణంగా ప్రజలకు నీటి సమస్య తొలగించాల్సిందిపోయి రైతులకు ఇబ్బందులు తెస్తున్నారు. ప్రజల సమస్యలను తీర్చడానికి తలపెట్టిన పథకం కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది. వర్షాల కారణంగా వరదలు వస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం రైతు పరిస్థితి అలా తయారయింది. ఎండనకా.. వాననకా ఆరుగాలం కష్టపడి పండించిన కౌలు రైతు రెక్కల కష్టం మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నోటికాడికి వచ్చిన పంట కొట్టుకపోయిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. గార్ల మండల కేంద్రంలోని కౌలు రైతు తోడేటి శ్రీనివాస్ మండల కేంద్రంలో ఆరు ఎకరాలు పొలం కౌలుకు చేసి ఇటీవల హార్వెస్టర్ తో కోయించిన పంటను అమ్ముకునేందుకు వ్యవసాయ మార్కెట్ కు తరలించి వడ్లను అరబోశారు శాతం రావడంతో మంగళవారం ఆరబోసిన వడ్లను దగ్గరకు చేసి బుధవారం ఉదయం తమ వడ్లను కాంట వేయిద్దామని వడ్ల రాశి వద్దకు వచ్చి చూస్తే వడ్లు మొత్తం కొట్టుకపోయిన ఉన్న సంఘటనను చూసి రైతు శ్రీనివాస్ లబోదిబోమంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా రైతు శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ పక్కనే ఉన్న మిషన్ భగీరథ ట్యాంకుల ఓవర్ ఫుల్ నీటి కారణంగా తమ వడ్ల రాసి మొత్తం కొట్టుకుపోయిందని, సుమారుగా నాలుగు పుట్ల వడ్లు కొట్టకపోవడం పట్ల దాదాపు 30 నుండి 40 వేల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారుల పర్యవేక్షణాలోపం మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా ట్యాంకుల ఓవర్ ఫుల్ తో ఉబ్బెత్తున నీరు రావడంతో తమ పంట కొట్టుకపోయిందని అప్పులు చేసి మరి పెట్టుబడులు పెట్టి రెక్కలను ముక్కలుగా చేసుకొని ఆరుగాలం కష్టపడి పండించి చివరకు చేతికొచ్చిన పంట ఇలా నీటి పాలు అవుతూ కొట్టుకుపోయినా ఇంతవరకు అధికారులు స్పందించలేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తమకు పంట నష్టపరిహారం చెల్లించాలని లేనియెడల కుటుంబంతో సహా ఆత్మహత్యే మాకు శరణ్యమన్నారు.