హైదరాబాద్: డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. వంద శాతం సబ్సిడీతో పేదలకు ఇండ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి, లబ్ధిదారుల ఎంపికపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి ప్రశాంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. పూర్తయిన ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక వేగంగా, పారదర్శకంగా జరగాలని అధికారులకు మంత్రి వేముల సూచించారు. అర్హులకు మాత్రమే రెండు పడక గదుల ఇండ్లు అందేలా చూడాలన్నారు. నిర్మాణ తుది దశలో ఉన్న ఇండ్లు వెంటనే పూర్తిచేయాలని సూచించారు. కాగా, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ ప్రగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై మంత్రి వేముల బుధవారం కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 2,91,057 ఇండ్లను మంజూరు చేయగా, అందులో 1,29,528 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి వెల్లడించారు. మరో 58,350 ఇండ్ల నిర్మాణం తుదిదశకు చేరుకోగా, మిగిలిన 40,651 ఇండ్ల నిర్మాణం పనులు వివిధ దశలో ఉన్నాయని వివరించారు. పేదల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.11,614.95 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పేదల కోసం రూ.19,328.32 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో 2,91,057 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసినట్టు, ఇందులో 2,28,529 ఇండ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.
సీఎం కేసీఆర్ మానస పుత్రిక డబుల్ బెడ్‌రూం స్కీమ్: మంత్రి వేముల
RELATED ARTICLES