శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రత మధ్య గురువారం ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు చేశారు. గత 22 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మెక్కులు, కానుకలతోపాటు అన్నదాన భవనంలోని హుండీలో వేసిన మెక్కులు నగదు రూపంలో రూ.5,76,42,564 ఆదాయంగా వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. వీటితోపాటు 391 గ్రాముల బంగారం, 8.410 కిలోల వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మెక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్తీకమాసం సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు వేడుకలను కనుల పండువలా నిర్వహించారు.